Telugu Director Pavan Sadineni | సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో ఓ యువతిని నమ్మించి, లైంగికంగా వేధించిన కేసులో టాలీవుడ్ దర్శకుడు పవన్ కుమార్ సాదినేనిని హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఈ ఘటన టాలీవుడ్ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
విజయవాడకు చెందిన పవన్ సాదినేని గతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సహజీవనానికి దారితీసింది. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని పవన్ ఆమెకు దగ్గరయ్యాడు. ఆసుపత్రి ఖర్చులు భరించడంతో పాటు, సినిమాల్లో మంచి నటిగా అవకాశాలు ఇప్పిస్తానని, కెరీర్ చూసుకుంటానని నమ్మబలికాడు.
అయితే పవన్‌కు ఇదివరకే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం బాధితురాలికి ఆలస్యంగా తెలిసింది. దీనిపై ఆమె నిలదీయగా.. తాను భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నానని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇక పెళ్లి హామీ తర్వాత బాధితురాలిని పవన్ క్రమంగా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. కేవలం తన లైంగిక అవసరాల కోసం నెలకు ఒకసారి మాత్రమే వచ్చి వెళ్లేవాడని, సినిమాల్లో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేశాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది.
ఈ నెల 5వ తేదీన ఇంటికి వచ్చిన పవన్ తనపై ఒత్తిడి తెచ్చి, అసాధారణ లైంగిక చర్యలతో హింసించాడని బాధితురాలు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా BNS చట్టంలోని సెక్షన్ 69, 115(2) కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా పవన్‌కు ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.