Patang Movie | 2025 ఏడాది ముగింపులో డిసెంబర్ 25న ఏకంగా ఎనిమిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ పెద్ద సినిమాల సందడిలో ఒక చిన్న సినిమాగా వచ్చిన “పతంగ్” తనదైన ముద్ర వేయగలిగింది. ప్రమోషన్లు తక్కువగా ఉన్నా, ట్రైలర్ మరియు పాటలతో ముందే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
విస్కీ (వంశీ పూజిత్), అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. దాదాపు 12 ఏళ్ల వీరి స్నేహంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఐశ్వర్య పట్ల ఇద్దరికీ ఇష్టం ఏర్పడడంతో వీరి స్నేహంలో చిన్నపాటి గ్యాప్ వస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథకు ఒక స్పష్టమైన ముగింపుని ఇవ్వడం కోసం, హీరోలు ఇద్దరూ పతంగుల పోటీని ఎంచుకుంటారు. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరికి ఐశ్వర్య ఎవరిని వరించింది? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది తెలుగు తెరకు కొత్తేమీ కాకపోయినా, దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి దానిని ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాదీ సంస్కృతిని, ఆ నేపథ్యాన్ని వాడుకుంటూ రాసుకున్న సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. సింపుల్ కథ అయినప్పటికీ, ఆసక్తికరమైన క్యారెక్టరైజేషన్లు, మంచి మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయి. ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఒక క్లీన్ ఎంటర్టైనర్ను అందించడంలో దర్శకుడు విజయం సాధించాడు.
నటీనటుల పనితీరు:
నటీనటుల విషయానికి వస్తే.. కేవలం సోషల్ మీడియా స్టార్‌గానే కాకుండా, నటిగా తనలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని ప్రీతి పగడాల ఈ చిత్రంతో నిరూపించుకుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో యువతలో ఉండే సందిగ్ధతను ఆమె ఎంతో చక్కగా పండించింది. ఇక వంశీ పూజిత్ నటనలో ఒక రకమైన ఈజ్ కనిపిస్తుంది; ఒకప్పటి ధనుష్‌లాంటి సహజత్వం, హీరో నానిలో ఉండే టైమింగ్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో ఇన్నోసెన్స్ చూపించడంలో వంశీ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. మరో హీరో ప్రణవ్ కౌశిక్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డ్యాన్స్‌లతో ఆకట్టుకోగా, వంశీ-ప్రణవ్ మధ్య వర్కవుట్ అయిన కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితో పాటు ఎస్.పి.చరణ్, వడ్లమాని శ్రీనివాస్ తమ అనుభవంతో పాత్రలకు నిండుదనాన్ని తీసుకురాగా, విషిక పోషించిన మాస్ పాత్ర ఆమె మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ప్రణవ్ చెల్లెలిగా నటించిన విజ్ఞాని తన క్యూట్ యాక్టింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గెస్ట్ రోల్ కథలో కీలకంగా మారడమే కాకుండా, సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంకేతిక వర్గం:
సినిమా విజయంలో సంగీత దర్శకుడు జోస్ జిమ్మీ, సినిమాటోగ్రాఫర్ శక్తి అరవింద్ కీలక పాత్ర పోషించారు. జోస్ జిమ్మీ అందించిన పాటలు, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేశాయి. శక్తి అరవింద్ విజువల్స్ చాలా సహజంగా, రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ సాదాసీదా కథను పతంగుల పోటీ అనే పాయింట్‌తో ముడిపెట్టి ఎంతో ఆసక్తికరంగా మలిచాడు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పెర్ఫార్మెన్స్
సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్
వినోదాత్మకమైన క్లైమాక్స్
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మైనస్ పాయింట్స్:
ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం
కొత్త ముఖాలు కావడం వల్ల సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ అవ్వడానికి సమయం పట్టడం
చివరిగా: ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్రెష్ సినిమా “పతంగ్”. థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 3/5