Sameera Reddy | బాలీవుడ్‌లోనూ సత్తాచాటిన తెలుగమ్మాయి సమీరా రెడ్డి. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. అయితేనేం, సోషల్‌మీడియా ద్వారా అనేక విషయాలను పంచుకుంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందిస్తుంది. ఇద్దరు పిల్లల తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానంటూ సమీర చెబుతున్న కబుర్లు..
నేను అనేక విజయవంతమైన సినిమాల్లో నటించాను. డబ్బు సంపాదించాను. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. అయినా నన్ను నేను తక్కువ చేసుకునేదాన్ని. అందంగా లేనని కలత చెందేదాన్ని. నిరాశ, ఒత్తిడితో మానసిక వేదనకు గురయ్యాను. ఆ పరిస్థితిని జయించడం చాలా కష్టంగా అనిపించింది. ఎలాగోలా ఒడ్డున పడ్డాను. అలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నవారికి ధైర్యం చెబుతూ నావంతు సాయం చేస్తున్నా.
అక్షయ్ వార్దేతో ప్రేమ, పెండ్లి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి అక్షయ్‌ని తొలిసారి చూడగానే ఇష్టపడ్డాను. నేనే ముందుగా నంబర్ అడిగి తీసుకున్నా. తను చాలా సపోర్టివ్. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు అండగా ఉన్నాడు. చాలా ప్రోత్సహించాడు. తనే పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. రెండు కుటుంబాల ఆమోదంతో మా వివాహం చాలా ఘనంగా జరిగింది.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అది సర్వసాధారణం. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఆ పరిణామాన్ని ఒక వింతగా భావిస్తారు. రకరకాలుగా ట్రోల్స్ చేస్తారు. మొదటిసారి గర్భం ధరించినప్పుడు ఆ ట్రోల్స్ చూసి చాలా బాధపడ్డాను. వాటిని పట్టించుకోవాల్సిన పన్లేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే రెండోసారి తల్లి అయినప్పుడు ప్రతిక్షణాన్నీ ఆస్వాదించా.
కరోనా కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సంక్షోభ సమయంలో నాకు తెలిసిన చిట్కాలు, సలహాలు అభిమానులతో పంచుకున్నాను. నచ్చని ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పడానికి వెనుకాడను. నామీద నాకు నమ్మకం ఎక్కువ.
నాకు కొంచెం కోపం ఎక్కువ. అక్షయ్ చాలా కూల్. మా ఇద్దరిలో.. నాకే కామెడీ సెన్స్ అధికం. భార్యాభర్తలుగా మారిన తర్వాతే ప్రేమికుల బాధ్యత మరింత పెరుగుతుంది. పిల్లలు పుట్టాక ఆ బాధ్యత రెట్టింపు అవుతుంది. సినిమాలకు దూరమైనా భార్యగా, తల్లిగా ప్రతిక్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నా. నా పిల్లలు హన్స్, నైరా.. బాగా అల్లరి చేస్తారు. ఆ ఇద్దరి ఆటపాటలను బాగా ఆస్వాదిస్తాను. పిల్లల పెంపకంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నా.
హీరోయిన్గా ఉన్నప్పుడు పూర్తిగా సినిమాలతోనే సరిపోయేది. దేనికీ సమయం దొరికేది కాదు. ఇప్పుడు నా కోసం కొంత సమయం కేటాయించుకుంటున్నా. శరీరం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నా. అందం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని తెలుసుకుంటే చాలు. ఏ రంగంలో అయినా విజయం లభిస్తుంది.
Read More :
Meenakshi Chaudhary | ఒంపుసొంపులు ఒలకబోస్తున్న మీనాక్షి చౌదరి..