ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రొడక్ట్ కంపెనీ లార్వెన్ ఏఐ స్టూడియో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ఆయన ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కంపెనీ లోగోను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘రెండు సంవత్సరాల క్రితం నాకు ఈ ఐడియా వచ్చింది. భవిష్యత్తులో ఏఐ అన్ని రంగాలను ప్రభావితం చేయబోతున్నది. స్క్రిప్ట్, ప్రీపొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్…ఇలా సినిమాకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సులభతరం చేసేలా టూల్స్‌ని రూపొందించాం.
ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక మంది దర్శకులతో చర్చించి సలహాలను తీసుకున్నాం. ఈ ఏఐ టూల్స్ స్క్రిప్ట్ దశలోనే సినిమాను ప్రీవిజువలైజ్ చేస్తాయి. ఈ టెక్నాలజీ వల్ల సక్సెస్ శాతాన్ని పెంచుకునే వీలుంటుందని భావిస్తున్నా. అలాగే ఫిల్మ్ మేకింగ్‌లో సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త దర్శకుల సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ టూల్స్ ఎంతగానో దోహదం చేస్తాయి.
విజయ్ దేవరకొండతో రూపొందించబోతున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమా కోసం ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. అలాగే టైగర్ మీద ఓ వీఎఫ్ఎక్స్ చిత్రాన్ని చేయబోతున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సుకుమార్, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లితో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.