Mirai Movie | టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా కథానాయకుడిగా నటించి సూపర్ హిట్ అందుకున్న చిత్రం మిరాయ్. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించగా.. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కళింగ యుద్ధానంతరం రక్తపాతాన్ని చూసి వైరాగ్యభావాన్ని పొందిన అశోకుడు, సమస్త సామ్రాజ్యాన్నీ పరిత్యజించి సన్యసించాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగా తనలోని దైవీక శక్తులన్నింటినీ తొమ్మిది గ్రంధాల్లో నిక్షిప్తం చేసి, వాటి రక్షణార్థం ఎనిమిది గ్రంధాలను ఎనిమిదిమంది యోధులకు అందజేస్తాడు. ఒక పుస్తకాన్ని మాత్రం ఓ ఆశ్రమానికి అందిస్తాడు. అవి దుష్టులకు చేరితే సృష్టికే అనర్థం అని తెలియజేస్తాడు. అశోకుడి అజ్ఞానుసారం ఆ గ్రంధాలు ఆయా ప్రదేశాల్లో తరతరాలుగా రక్షణ పొందుతూ ఉంటాయి. వాటిని కైవసం చేసుకోవాలని ప్రయత్నించి ప్రతి దుష్టశక్తీ అంతమైపోతూ ఉంది. ఈ క్రమంలో తాంత్రిక విద్యలలో నిష్ణాతుడు, భగవంతుడి సృష్టిమీదే కోపాన్ని పెంచుకున్న దుర్మార్గుడు, అతి బలవంతుడూ అయిన బ్లాక్స్వార్డ్ అమరత్వ సిద్ధి కోసం ఆ తొమ్మిది గ్రంధాలనూ కైవసం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయాన్ని ముందుగానే తన దివ్యదృష్టితో కనుకొన్న తొమ్మిదవ గ్రంధం రక్షకురాలు అంబిక(శ్రియ శరణ్) మిగతా ఎనిమిది గ్రంధాల రక్షకులనూ ముందుగానే హెచ్చరిస్తుంది. కానీ వాళ్లు బ్లాక్స్వార్డ్ను తేలిగ్గా తీసుకుంటారు. వాడు ఎప్పటికైనా ఎనిమిది గ్రంధాలనూ కైవసం చేసుకొని తొమ్మిదో గ్రంధంకోసం తన దగ్గరకే వస్తాడని ముందే గ్రహించిన అంబిక.. అగస్త్యమహామునిని ఆశ్రయిస్తుంది. ఆ బ్లాక్ స్వార్డ్ను చంపే శక్తి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకే ఉన్నదన్న విషయం అగస్త్యుని ద్వారా తెలుసుకున్న అంబిక.. అగస్త్యుని సూచన మేరకు ఆ బిడ్డ పుట్టగానే, కాశీలో వదిలి వెళ్లిపోతుంది. అలా అనాధగా పెరిగిన వేద(తేజ సజ్జా)కు 24 ఏళ్లు వస్తాయి. అనుకున్నట్టే బ్లాక్ స్వార్డ్ ఎనిమిది గ్రంధాలనూ కైవసం చేసుకొని తొమ్మిదో గ్రంధం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలవల్ల వేదకు తన జన్మ రహస్యం తెలుస్తుంది. హిమాలయాల్లో నరమానవులు సైతం ప్రవేశించలేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న ‘మిరాయ్’ని సాధిస్తే తప్ప బ్లాక్ స్వార్డ్ను మట్టుపెట్టలేమని తెలుసుకుంటాడు. మరి వేదా ‘మిరాయ్’ని ఎలా సాధించాడు? వేదా సూపర్ యోధాగా ఎలా మారాడు? బ్లాక్ స్వార్డ్ని ఎలా అంతం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.