Teja | దర్శకుడు తేజ ఒకప్పుడు తెలుగులో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ‘చిత్రం, నువ్వు నేను, జయం’ చిత్రాలు తనను స్టార్ డైరెక్టర్‌ను చేశాయి. ఆ తర్వాత అదే మూసలో చిత్రాలు తీసి ఫ్లాపులు మూటగట్టుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీతో హిట్ కొట్టిన తేజ ఆ తర్వాత రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. అయితే తేజ ఇప్పుడు హైదరాబాదుకు చెందిన ఏఐ స్టార్టప్ న్యూరానిక్స్‌తో కలిసి, ఇండియాలో మీడియా & ఎంటర్టైన్మెంట్ రంగాన్ని రక్షించే పరిష్కారాలను అభివృద్ధి చేసి జాతీయ యాంటీ-పైరసీ చాలెంజ్ అవార్డును గెలుచుకున్నారు.
అమీర్ ఖాన్ చేతుల మీదుగా తేజ ఈ అవార్డ్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పైరసీ అనేది పెన సవాల్ కాగా, ఆన్లైన్లో కంటెంట్ వచ్చాక టేక్ డౌన్ చేయడం సరైనది కాదు. తొలి రోజు నుండే కంటెంట్ రక్షించుకోవాలి. అందుకోసమే మేము న్యూరానిక్స్ తో భాగస్వాములుగా మారాము అని తేజ తెలిపారు. వేవ్స్ 2025 ప్రదర్శనని నరేంద్ర మోదీ సందర్శించి మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ విజన్‌లో భాగంగా మీడియో, కల్చర్ రంగాల్లో ఇంటెలిజెంట్ పరిష్కారాల అవసరాన్ని హైలైట్ చేసినట్టు తెలిపారు. పైరసీకి వ్యతిరేకంగా మోదీ గారి గట్టి ఆలోచనలు మనకు ఎంతో ప్రేరణను ఇస్తున్నాయి. ప్రభుత్వ మద్దతుతో ఇండస్ట్రీకి నిజమైన రక్షణ సాధ్యమవుతుంది అని తేజ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో వినోద రంగంతో పాటు మీడియా ప్రతి సంవత్సరం కూడా పైరసీ వలన సుమారు $1.2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. దీనికి సమర్థవంతమైన, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు అత్యవసరం. న్యూరానిక్స్‌తో పాటు తేజ తేజరాక్ట్ కంపెనీ ఈ రంగంలో భారతదేశం సత్తాను చాటేందుకు కృషి చేస్తున్నాయి. అయితే దర్శకుడిగా సత్తా చాటి గత రెండు దశాబ్ధాలలో వెయ్యికి పైగా నటులని పరిచయం చేసిన తేజ పైరసీకి వ్యతిరేకంగా సాంకేతిక పరిష్కారాలను అందించి మరోసారి తన కృషిని చాటుకున్నారు. తేజ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.