Teja Sajja | డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న హీరో,పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. తాజాగా తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ చిత్రం ఈ ట్రెండ్‌కు నిదర్శనంగా నిలిచింది. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ‘మిరాయ్’ చిత్రం కేవలం కొన్ని రోజుల్లోనే 200 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు (20 కోట్ల నిమిషాలు) దాటింది. ఇది తేజ సజ్జా కెరీర్లోనే కాకుండా ఇటీవల కాలంలో తెలుగు సినిమా సాధించిన అరుదైన ఘనతగా నిలిచింది.
‘మిరాయ్’ థియేటర్లలో విడుదలై దాదాపు ₹200 కోట్ల వసూళ్లు సాధించింది. పాన్-ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా భారతదేశంతో పాటు మలేషియా, బ్యాంకాక్, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని అధిక సంఖ్యలో వీక్షిస్తున్నారు. కుటుంబం అంతా కలిసి చూడగలిగే ఫ్యామిలీ – ఫాంటసీ కంటెంట్ ఈ విజయం వెనుక ప్రధాన కారణంగా మారింది.
జియో హాట్‌స్టార్ లో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. థియేట్రికల్ వెర్షన్ 2 గంటల 49 నిమిషాల నిడివితో విడుదల కాగా, ఓటీటీ వెర్షన్‌ను 2 గంటల 46 నిమిషాలకు ట్రిమ్ చేశారు. ‘వైబ్ ఉండి…’ పాటను డిజిటల్ వెర్షన్లో నుంచి తొలగించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘మిరాయ్’ హిందీ వెర్షన్ నవంబర్ 2025లో విడుదల కానుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా ఈ సినిమాతో మరోసారి తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా పాన్-ఇండియా హీరోగా తన రేంజ్‌ను నిరూపిస్తున్నాడు. మొత్తానికి ఈ కుర్ర హీరో కెరీర్ మొదట్లోనే ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తున్నాడు.