“మిరాయ్’ యాక్షన్, అడ్వెంచర్, డివోషన్ కలబోసిన సినిమా. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది’ అన్నారు తేజ సజ్జా. ‘హనుమాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ యువహీరో తాజాగా సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
ఒక మామూలు యువకుడు తన ధర్మాన్ని, పౌరాణిక యోధులతో అనుబంధాన్ని తెలుసుకొని ఓ పెద్ద ఆపద నుంచి రక్షించడానికి ఎంత దూరం వెళ్లాడు? తన తల్లి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడన్నదే ‘మిరాయ్’ కథ. ఇతిహాసాల్లో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి సూపర్ యోధ ఏం చేశాడన్నది ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ సినిమాలో మొత్తం 9 రోమాంచితమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీది ఎక్స్ట్రార్టినరీగా అనిపిస్తుంది. ప్రేక్షకులు వాటిని చూస్తూ థ్రిల్ ఫీలవుతారు. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర ఓ సిద్ధాంతాన్ని నమ్ముతుంటుంది. నేను పోషించిన సూపర్ యోధ పాత్రకు పోటాపోటీగా సాగుతుంది.
‘మిరాయ్’లో శ్రీరాముడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ ఎపిసోడ్ బలవంతంగా ఇరికించింది కాదు. కథలో భాగంగానే వస్తుంది. చిన్న భాగమే అయినా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనితో పాటు సినిమాలో మరో రెండు సర్‌ప్రైజ్‌లుంటాయి. అవేమిటో తెరపై చూడాల్సిందే.
నేను సక్సెస్‌ను తలకెక్కించుకోను. ఒక సినిమా మించి మరో సినిమా చేయాలనే అంచనాలు పెట్టుకోను. నా దృష్టిలో ప్రతీ సినిమా ప్రత్యేకమే. ప్రతీ సినిమాకు వందశాతం ఎఫర్ట్స్ పెడతాను. డెడికేషన్‌తో పనిచేస్తాను. అందుకే ‘హనుమాన్’ విజయంతో వ్యక్తిగతంగా నేనేమీ మారలేదు. కొత్తరకం సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం.
‘హనుమాన్’ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ముందుగా అనుకున్న స్కేల్లోనే తీశాం. నా మెయిన్ గ్రౌండ్ తెలుగు ప్రేక్షకులు. వారికోసమే తీసిన సినిమా ఇది. ఇతర భాషల్లో ఆడితే ఆనందం. నేను తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే సినిమాలు చేస్తా. ఈ సినిమా విషయంలో చిరంజీవి, కరణ్‌జోహార్ ఇచ్చిన ప్రశంసల్ని ఎప్పటికీ మర్చిపోను.
‘మిరాయ్’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే తప్పకుండా సీక్వెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ‘జాంబిరెడ్డి-2’ చిత్రాన్ని చేస్తున్నాను. వాస్తవంగా నేను ఓ సినిమాకు కమిట్ అయితే రిలీజ్ అయ్యేంత వరకు దానిమీదనే దృష్టి పెడతాను. అందులో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఆడియెన్స్‌లో క్రెడిబిలిటీ సంపాదించుకోవాలన్నదే నా ప్రథమ లక్ష్యం.