‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన సుందరి తారా సుతారియా. గాయనిగానూ ఈ భామకు పేరుంది. అభిషేక్ బచ్చన్‌తో ‘మార్జవాన్’, అహన్ శెట్టితో ‘తడప్’ చిత్రాల్లో నటించి నాయికగా గుర్తింపు తెచ్చుకుంది. టైగర్ ష్రాప్ జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘హీరోపతి 2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న తారా..తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. త్వరలో హాలీవుడ్ వెళ్లనున్నట్లు ప్రకటించింది.
ఓ హాలీవుడ్ చిత్రానికి తనను సంప్రదించారని అంటున్నది తార. ఆమె మాట్లాడుతూ…‘నా బాలీవుడ్ అరంగేట్రానికి ముందు లండన్‌లో ఉండి వచ్చా. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. విదేశాల్లో అవకాశాలున్నా వెళ్లలేకపోయా. ఇప్పుడు కూడా మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ హాలీవుడ్ చిత్రానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆ వివరాలు చెబుతా. మన నటీనటులు ఎంతోమంది ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తున్నారు. నేను ఇంకా ఆలస్యం చేస్తే తర్వాత బాధపడాల్సి ఉంటుంది’ అని చెప్పింది.