My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో ఈనెల జూలై 11న విడుదల చేయనున్నారు.
గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి 15 విజయవంతమైన చిత్రాలను నిర్మాతగా అందించిన సురేష్ కొండేటి, డిస్ట్రిబ్యూటర్‌గా 85కు పైగా సినిమాలను విడుదల చేశారు. ‘మై బేబి’ ఆయన నిర్మాణంలో వస్తున్న 16వ చిత్రం. ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది. పిల్లల అపహరణలు, ఆసుపత్రులలో పిల్లలను మార్చడం వంటి సున్నితమైన సామాజిక సమస్యలను ఈ చిత్రం స్పృశించిందని, ఇది సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తుందని చిత్ర బృందం పేర్కొంది.