సంగీత స్రష్ట ఇళయరాజా స్వర ప్రయాణానికి 50ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా మ్యూజిక్ మ్యాస్ట్రో 50ఏండ్ల స్వరప్రయాణ వేడుకను అధికారికంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన ఇళయరాజాను తమిళనాడు సీఎం స్టాలెన్ స్వయంగా కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. తదనంతరం ఆయన తన ఎక్స్(ట్విటర్)లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇళయరాజా అర్ధశతాబ్దపు సంగీత ప్రయాణ వేడుకలో అభిమానులంతా భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది అందరి వేడుకగా ఆయన అభివర్ణించారు.
ఇదిలావుంటే.. తన ‘సింఫొని’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి 13 దేశాలతో ఒప్పందం కుదిరినట్టు ఇళయరాజా తెలియజేశారు. మార్చి 9న లండన్లో ఆయన ‘సింఫొని’ కార్యక్రమం వైభవంగా జరిగింది. త్వరలో దుబాయ్, ప్యారిస్ తదితర చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఇళయరాజా తెలిపారు. తన ‘సింఫొని’ కార్యక్రమాన్ని దయచేసి ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోవద్దని, తనను అభిమానించేవారు ప్రత్యక్షంగా తన ‘సింఫొని’ సంగీతాన్ని వినాలని ఇళయరాజా విజ్ఞప్తి చేశారు.