తన గురించి వస్తున్న వార్తల పట్ల బాధపడుతున్నానని అంటున్నది అందాల నాయిక తమన్నా. తన సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకుని మాట్లాడాలని ఈ తార సూచిస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో తమన్నా ఓ ప్రత్యేక గీతం చేస్తున్నది అనే వార్తలు ఇటీవల నెట్టింట చక్కర్లు కొట్టాయి. గతంలోనూ తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కొత్త చిత్రంలోనూ ఆమె ఆడిపాడనుందని చెప్పుకున్నారు. ఈ వార్తలపై స్పందించింది తమన్నా. ఆమె ట్వీట్ చేస్తూ…‘అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల్లో నటించాను. ఆయనతో పనిచేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అలాగే సీనియర్ హీరోగా బాలకృష్ణ అంటే గౌరవం ఉంది. అయితే వీరి కాంబినేషన్ సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాననే వార్తలు అవాస్తవం. ఈ న్యూస్ నన్ను బాధించింది. కొంతైనా తెలుసుకుని పోస్టులు చేయాలని కోరుతున్నా’ అని పేర్కొంది.