Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారింది. ఆ తర్వాత తమన్నా పలు హిందీ చిత్రాలలో కూడా నటించి అలరించింది. అయితే ఇప్పుడు తమన్నాకి క్రేజీ ఆఫర్ దక్కింది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న ప్రఖ్యాత మైసూరు శాండల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా నియమించారు. ఈ ఒప్పందం రెండేళ్ల కాలానికి కుదరగా, ఇందుకోసం ఆమెకు రూ. 6.2 కోట్ల భారీ మొత్తం చెల్లించనున్నట్లు తెలుస్తుంది. అయితే తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం పట్ల కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడలో ఇంత మంది స్టార్స్ ఉండగా, ఆమెని ఎంపిక చేయడం పట్ల కన్నడిగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ రియాక్ట్ అయ్యారు. తనకు కన్నడ పరిశ్రమపై గౌరవం ఉంది, కాని కేఎస్డిఎల్ సంస్థ తమ ఉనికిని దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అందుకే తాము పాన్ ఇండియా సెలబ్రిటీని ప్రచారకర్తగా పెట్టామని అన్నారు. తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తుంది. జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపు ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని బ్యాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటే తమ ప్రొడక్ట్‌ని మరింత విస్తరించవచ్చు. తమన్నా హై ప్రొఫైల్ బ్యూటీ, స్కిన్ కేర్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేశారు.
తనకి అనుభవం ఉంది కాబట్టి ఆమె ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి వ్యాప్తి చేయవచ్చు. మార్కెటింగ్ నిపుణుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారానే తమన్నాని ఎంపిక చేశాం అని వివరణ ఇచ్చారు. తమన్నా ఈ మధ్యకాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది అనే చెప్పాలి. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తెలుగులో రీసెంట్ గా ఓదెల 2 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తమన్నా అఘోర పాత్రలో కనిపించి మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక పలు వెబ్ సిరీస్‌లలో కూడా తమన్నా నటిస్తూ సందడి చేస్తుంది.