Tamannaah | కథానాయికగా మారి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ల జాబితాలోనే ఉన్నారు తమన్నా. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే.. ఆ పాట సినిమాకే హైప్ తెస్తున్నదని నిర్మాతలు నమ్ముతున్నారు. ఆమె వెబ్ సిరీస్ చేసినా దానికి ఎక్కడ లేని బజ్ క్రియేట్ అవుతున్నది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదనడానికి తార్కాణాలివే. దానికి తగ్గట్టే అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు తమన్నా. రీసెంట్గా నిర్వహించిన చిట్ చాట్లో ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ‘సినిమా ఇండస్ట్రీలోకి స్త్రీలు రావడం అంటే ఇప్పటికీ అదో పెద్ద విషయం. అదో నేరంగా భావించేవాళ్ల లిస్ట్ కూడా చాలా పెద్దదే. అంతెందుకు.. నేను నటిని అవ్వాలనుకుంటున్న విషయం ఇంట్లో చెప్పాను.
ఆ విషయం ఎలాగో ఇరుగుపొరుగుకి తెలిసింది. అంతే.. నేను పెద్ద నేరం చేస్తున్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టారు. మా అమ్మానాన్నలకు సినిమా ఇండస్ట్రీ గురించి భయంకరంగా చెప్పారు. నా పేరెంట్స్ వాళ్ల మాటలు విన్నట్టయితే.. ఈ రోజు నటిగా నా కెరీర్ ఉండేది కాదు. వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఎందుకు భూతద్దంలో చూడటం?’ అంటూ ప్రశ్నించారు తమన్నా. ఇంకా చెబుతూ ‘ఈ మధ్య సోషల్ మీడియాలో ఆడవాళ్లు ఎలాంటి వస్ర్తాలను ధరించాలో కొందరు అంకుల్స్ సలహాలిస్తుండటం చూస్తున్నా. అలాంటి వారికి నేను చెప్పేదొక్కటే.. ముందు మీ మానసిక పరిస్థితిని సరిచేసుకోండి. కావాలంటే మానసిక వైద్యులను కలవండి. అనవసరంగా విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి’ అంటూ చెప్పుకొచ్చారు తమన్నా భాటియా.