కెరీర్ తొలినాళ్లలో భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు వెంటాడాయని, ఒకానొక దశలో ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నానని చెప్పింది అగ్ర కథానాయిక తాప్సీ. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ సినీరంగంలో తొలిరోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన అందం పట్ల కూడా అభద్రతాభావం ఉండేదని, ఫ్యాషన్ సెన్స్ కూడా అస్సలు ఉండేది కాదని తాప్సీ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఇలాంటి సాధారణ అందంతో నన్నెవరైనా నాయికగా ఎంపిక చేసుకుంటారా? అనే ప్రశ్న నిరంతరం వెంటాడేది. ైస్టెలింగ్, మేకప్ మీద కూడా ఏమాత్రం అవగాహన ఉండేది కాదు. దాంతో ఒక ఏడాది పాటు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను.
అయితే సమయం గడుస్తున్న కొద్దీ నటనతో పాటు ఇండస్ట్రీని అర్థం చేసుకునే విషయంలో పరిణితి వచ్చింది. నటిగా నా ప్రతిభాపాటవాలు కూడా మెరుగయ్యాయి. విమర్శల గురించి పట్టించుకోకుండా సవాళ్లను స్వీకరిస్తూ ముందుకుసాగా. ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రయాణం ఆశించిన ఫలితాల్ని అందించింది’ అని చెప్పింది తాప్సీ.