దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్యస్మృతికి నివాళిగా రూపొందించిన ‘స్వప్నాల నావ’ గీతం యూట్యూబ్లో పదిలక్షల వీక్షణలను సొంతం చేసుకుంది. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ పాటకు రూపకల్పన చేశారు. పార్థసారథి నేమాని స్వరపరచిన ఈ గీతానికి యశ్వంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై గోపీకృష్ణ కొటారు నిర్మించారు. ఆయన కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు అందులో నర్తించింది. పాటకు వస్తున్న అపూర్వ స్పందన పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. సిరివెన్నెల అభిమాని అయిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య అద్భుతంగా పాటను దృశ్యమానం చేశారని, సిరివెన్నెలకు ఇదొక నివాళి అని నిర్మాత పేర్కొన్నారు.