కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం కన్నడ ప్రేక్షకులనే కాక దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తుండగా, రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా కారణంగా అదుగో ఇదుగో అంటూ సినిమాను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు.
ఏప్రిల్ 14,2022న సినిమాని పక్కాగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీకి ఇంకా నాలుగు నెలలకు ఎక్కువే ఉంది. కనుక ఏ ప్యాచ్ వర్క్ ఉన్నా కూడా ఈ లోపు పూర్తి అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమాను సమ్మర్ తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.
భారీ అంచనాలున్న కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. మళ్లీ ఎందుకు విడుదల వాయిదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కేజీఎఫ్ 2 కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను రీ షూట్ చేయాలనుకుంటున్నారట. రీ షూట్ తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ కు సంబంధించి కూడా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అందుకోసమే మూవీని కొద్ది రోజుల పాటు వాయిదా వేసి బెటర్ ఔట్ పుట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.