Sushmita Konidela | సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతున్న పరిణామమే. అయితే, ఇటీవల కాలంలో స్టార్ కిడ్స్‌లో ముఖ్యంగా కూతుళ్లు తమ సత్తాను నిరూపించుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల కుమార్తెలు నటులుగా, నిర్మాతలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల కూడా టాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నటిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుష్మిత, తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. తాజాగా ఆమె నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, సుష్మిత కొణిదెల నిర్మాతగా తన తొలి పెద్ద సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్లో ఆమెకు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్‌గా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ భారీ విజయం తర్వాత సుష్మిత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో సినిమా చేస్తారు? ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారు? అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే “డాడీతో బ్లాక్‌బస్టర్ ఇచ్చారు, ఇప్పుడు రామ్ చరణ్‌తో కూడా సినిమా చేయండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితను యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. “తమ్ముడు రామ్ చరణ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?” అని ప్రశ్నించగా, సుష్మిత చాలా హ్యాపీగా స్పందించారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రశ్రేణి స్టార్ అని, ఆయనతో సినిమా చేయాలని అనేక మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తాను కూడా ఆ క్యూలోనే ఉన్నానని, ఈ విషయం రామ్ చరణ్‌కు చెబుతానని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.సుష్మిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుంది? ఎలాంటి కథను ఎంచుకుంటారు? అన్న విషయాలపై మాత్రం సుష్మిత ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.