Surya | సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య బిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య ఆసక్తికరంగా మాట్లాడారు. ‘బ్రేవ్ హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలను అందరం ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఇలాంటి సినిమాలు మనం ఎందుకు తీయలేకపోతున్నాం? ఎప్పుడు తీస్తాం?.. అని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు శివ ఈ కథ చెప్పాడు. ‘కంగువా’ ఓ వినూత్న ప్రయత్నం.
వందేళ్లక్రితం జన జీవనం, వారికి ఎదురైన కష్టాలు.. తదితర అంశాలను స్క్రీన్‌పై చూపిస్తే బాగుంటుందని ‘కంగువా’ చేశాను. హాలీవుడ్ స్థాయి సినిమా చేయాలనే కోరిక ‘కంగువా’తో తీరిపోయింది. అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించిన శివకు థ్యాంక్స్’ అని తెలిపారు సూర్య. ఇంకా మాట్లాడుతూ ‘నిజానికి ‘సూరారై పోట్రు’(ఆకాశమే నీ హద్దు) సినిమాకు ముందు నా సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో నిరాశకు లోనయ్యా. నా ఇమేజ్ ఎలా మార్చుకోవాలి? కెమెరా ముందు సంతోషంగా ఎలా కనపడాలి? సినిమాతో మళ్లీ ఎలా ప్రేమలో పడాలి? అనే విషయాల గురించి ఆలోచిస్తున్న సమయంలో సుధా కొంగర ‘సూరారై పొట్రు’ కథ చెప్పారు. ఆ సినిమా విజయం నా కెరీర్‌కి కొత్త ఊపిరిని ఇచ్చింది’ అని గుర్తు చేసుకున్నారు సూర్య.