‘కంగువా’ డబ్బుకోసం చేసిన సినిమా కాదు. మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలనే తలంపుతో చేసిన సినిమా. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. నేను ‘కంగువా’ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది.’ అని సూర్య అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. జ్ఞానవేల్‌రాజా నిర్మాత. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడారు. ప్రతి దర్శకుడికీ ఒక ఎపిక్ మూవీ చేయాలనుంటుందని, తనకు అలాంటి సినిమానే ‘కంగువా’ అని, అద్భుతమైన టీమ్ దొరకడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని దర్శకుడు శివ అన్నారు. రాజమౌళి స్పూర్తితోనే ‘కంగువా’ చేశామని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పారు. అతిథిగా విచ్చేసిన ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా హీరో సందీప్‌కిషన్, నటుడు అవినాష్, రైటర్ రాకేందుమౌళి కూడా మాట్లాడారు.