బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణం చిత్రంలోని ముఖ్యమైన పాత్రల్లో హనుమంతుడి క్యారెక్టర్ ఒకటి. ఈ పాత్రను సన్నీ డియోల్ పోషించనున్నట్లు సమాచారం. కొంత కాలంగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్ సినీ ప్రియుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. భారతీయ ఇతిహాస గాథ రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తుండగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు.
రావణుడిగా యష్, కైకేయిగా లారాదత్తా నటించనున్నారు. రావణుడి సోదరుడు విభీషణుడి పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతితో మేకర్స్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. మిగతా పాత్రలు సైతం త్వరలో ఖరారు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ ఇతిహాసానికి జీవం పోసే ప్రయాణం వచ్చే మార్చిలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. రామాయణం చిత్రీకరణ మొదటి భాగం మే నుంచి జూలై వరకు ఉంటుందని వినికిడి. ఈ తొలి విడత షూటింగ్కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియకు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది.