తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అగ్ర నిర్మాత సునీల్ నారంగ్ ప్రకటన విడుదల చేశారు. పదవి స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. టీఎఫ్‌సీసీ కొత్త పాలక మండలిని శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి మూడవ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఎంపిక గాకా, కార్యదర్శిగా శ్రీధర్ వి.ఎల్. ఖరారయ్యారు. ఇంకా 15మంది కార్యనిర్వాహక సభ్యులను కూడా ఎన్నుకున్నారు.
శనివారం జరిగిన సమావేశంలో సునీల్ నారంగ్ సినీ పరిశ్రమపై పాజిటీవ్‌గా స్పందించారు. అందరూ అనుకుంటున్నట్టు పరిశ్రమలో ‘ఆ నలుగురు’ లేరని, యజమానుల వద్దే థియేటర్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ నిర్మాతగానీ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్గానీ చేయరని ఆయన వ్యాఖ్యానించారు. అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తుఫాన్ లాంటివారని, ఆయన సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ఆయితే.. ఈ సమావేశంలోనే కార్యదర్శిగా ఎంపికైక శ్రీధర్ వి.ఎల్ అందుకు పూర్తి విరుద్ధం స్పందించారు. పర్సంటేజ్ విధానం రావాలని, సింగిల్ థియేటర్లను కాపాడుకోవాలని ఆయన చెబుతూనే, బంద్ ప్రస్థావన తామెప్పుడూ తేలేదని, ఇద్దరు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు కావాలనే దీన్ని ఇష్యూ చేశారని, వారి పేర్లు త్వరలో వెల్లడిస్తానంటూ వివాదానికి తెరలేపారు.
హీరోలు రెండేళ్లకో సినిమా చేయడం, మితం లేకుండా పారితోషికాలు అందుకోవడం.. సినిమా పరిశ్రమ ఇబ్బందుల పాలవ్వడానికి ప్రధాన కారణాలని ఆయన దుయ్యబట్టారు. ఒకే సమావేశంలో కొత్తగా ఎంపికైన అధ్యక్ష, కార్యదర్శుల పొంతన లేని స్పందనలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో.. సమావేశం జరిగి 24 గంటలు గడవకముందే అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేస్తూ ప్రకటన విడుదల చేశారు. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా ఇచ్చే ప్రకటనలకు తాను బాధ్యుడ్ని కానని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పదవిలో తాను కొనసాగలేనని సునీల్ నారంగ్ ప్రకటనలో పేర్కొన్నారు.