Sundeep Kishan Grand Mother | తెలుగు యువ నటుడు సందీప్ కిషన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేసమ్మ (88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం, సిరిల్ వీధిలో నివసించిన ఆగ్నేసమ్మ, ఒక రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఎంతోమంది పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారికి అండగా నిలిచారు. స్థానికంగా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మంగళవారం విశాఖపట్నంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్ హాజరై తన నానమ్మకు కడసారి నివాళులర్పించారు. సందీప్ కిషన్ తన మామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడుతో కలిసి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నానమ్మ పాడె మోసిన సందీప్ కిషన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నానమ్మ మరణంపై సందీప్ కిషన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. “నిన్న మేము మా నానమ్మను కోల్పోయాము. మా తాతయ్య కృష్ణం నాయుడు షిప్ ఆర్కిటెక్ట్ అయితే, నానమ్మ ఆగ్నెస్ వైజాగ్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. 1960ల నాటి వారి మతాంతర ప్రేమ ఒక సినిమా కథలాంటిది. లవ్ యూ నానమ్మ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు సందీప్ కిషన్‌కు ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు.