‘అనగనగా’ విజయం తర్వాత ఈటీవీ విన్ సంస్థలో సుమంత్ చేసిన సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకుడు. కె.హరీశ్ నిర్మాత. ఈ నెల 31న సినిమా థియేటర్లలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ‘ధమ్ ధమ్..’ అంటూ సాగే ఈ పాటను కృష్ణచైతన్య రాయగా, సింజిత్ యర్రమల్లి స్వరపరిచారు. సుమంత్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే థ్రిల్లర్ ఇది.
ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులోని వినయ్, కార్తీక్ పాత్రలు బలంగా ఉండాలని చెప్పా. ఆ పాత్రలు బావుంటే సినిమా బావుంటుంది. ఇప్పుడు విడుదలైన పాట కూడా ఆ పాత్రలపై చిత్రీకరించినదే. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది’ అని తెలిపారు. థ్రిల్లర్ జానర్ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఈ సినిమా పేరు మాత్రం తప్పకుండా ప్రస్థావనకు వస్తుందని దర్శకుడు రాజేశ్ కర్ణ నమ్మకంగా చెప్పారు. ఇంకా కె.హరీశ్, వేదవ్యాస్, గౌతమ్, త్రినాథ్లతోపాటు ఈటీవీవిన్ ప్రతినిథి సాయికృష్ణ కూడా మాట్లాడారు.