‘నా కెరీర్లో తొలిసారి సపోర్టింగ్ రోల్లో నటించాను. ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు కన్నీళ్లొచ్చాయి. అంతలా నా హృదయాన్ని కదిలించింది. ఈ సినిమా ఓ క్లాసిక్ లవ్‌స్టోరీగా మిగిలిపోతుంది’ అని అన్నారు సుమంత్. ‘సీతారామం’ చిత్రంలో ఆయన బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
యుద్ధ నేపథ్య ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, రష్మిక మందన్న కీలక పాత్రను పోషించింది. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం సుమంత్ పోషించిన బ్రిగేడియర్ విష్ణుశర్మ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సుమంత్ మాట్లాడుతూ ‘సవాలుతో కూడిన క్యారెక్టర్ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. హీరోగా నటిస్తూనే కథలో కీలకమైన సపోర్టింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా. స్క్రిప్ట్ నచ్చితే విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే’ అని తెలిపారు. గౌతమ్ మీనన్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైన్: సునీల్‌బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గీతా గౌతమ్, సమర్పణ: వైజయంతీ మూవీస్.