Sukumar and Devi Sri Prasad | టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటైన డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ల సుదీర్ఘ ప్రయాణానికి బ్రేక్ పడిందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘RC17’ నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు లేదా మేకర్స్ ఆయనను మార్చాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుకుమార్ కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన ప్రతీ చిత్రానికి సంగీతం అందించిన డీఎస్పీ, ఈ ప్రాజెక్ట్‌కు దూరమవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.
‘పుష్ప 2’ సినిమా సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ విషయంలో తలెత్తిన కొన్ని క్రియేటివ్ విభేదాలు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం హీరోగా నటిస్తూ బిజీగా ఉండటం, డేట్ల సర్దుబాటు సమస్యలు కూడా ఇందుకు మరో కారణమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘రంగస్థలం’ వంటి చారిత్రాత్మక హిట్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డీఎస్పీ స్థానంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ లేదా ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత రానుంది.