Kalam | భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం చాలా మందికి ఆదర్శం. “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన కలాం స్ఫూర్తిదాయక జీవితం ఆధారంగా బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ప్రముఖ నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ రోజు ధనుష్ బర్త్ డే సందర్భంగా కలాం మూవీ నుండి ధనుష్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.
అబ్ధుల్ కలాం పాత్రని ధనుష్ పోషించిన విధానం రాబోయే సంవత్సరాలలో చర్చనీయాంశం అవుతుంది. త్వరలోనే కలాం మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ సినిమాలతో గుర్తింపు పొందిన ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. నిర్మాతలుగా అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ వ్యవహరిస్తున్నారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఒక మహోన్నత ప్రయాణం త్వరలో ప్రారంభమవుతోంది. భారత మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి రాబోతున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓం రౌత్ గతంలో ప్రభాస్‌తో రూపొందించిన ‘ఆదిపురుష్’ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా, కలాం బయోపిక్‌తో మళ్లీ సీరియస్ సినిమా మేకింగ్‌కి సిద్ధమయ్యారు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే, ఎక్కువగా జీవిత చరిత్రలనే తెరకెక్కించారు. బాల గంగాధర్ తిలక్ బయోపిక్ గా ‘లోకమాన్య’, ‘తానాజీ’ కథతో హిస్టారికల్ మూవీ, శ్రీరాముడి స్టోరీతో ‘ఆదిపురుష్’ సినిమాలు రూపొందించారు. ఇప్పుడు కలాం బయోపిక్ బాధ్యతను భుజానికి ఎత్తుకోగా, ఈ సినిమాతో తన సత్తా చాటాలని కోరుకుంటున్నారు . రామేశ్వరంకి చెందిన కలాం నిరాడంబర కుటుంబం నుంచి వచ్చి DRDO, ISRO లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసి, దేశానికి అద్భుతమైన సేవలందించారు అబ్దుల్ కలాం. భారతదేశ 11వ రాష్ట్రపతిగా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.