‘బాహుబలి’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా కల్చర్‌కు తెర లేపారు విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ కల్చర్ పుణ్యమా అనీ.. ఏ భాషవారు సినిమా తీసినా.. అన్ని భాషలకూ కనెక్టయ్యేలా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి ఓ భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా ‘వారణాసి’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
‘వారణాసి’ అనేది దేశంలోని ప్రతి భాషకూ కనెక్టయ్యే టైటిల్. పైగా వారణాసి చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందట. అందుకే.. హైదరాబాద్‌లో భారీ వారణాసి సెట్ కూడా నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ దాదాపుగా అక్కడే తీస్తారని తెలుస్తున్నది. కథానుగుణంగా కూడా ‘వారణాసి’ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట.
అయితే.. ఈ సినిమాను రాజమౌళి గ్లోబల్ రేంజ్లో రూపొందిస్తున్నారనేది మరో టాక్. హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ ఇందులో భాగం కావడానికి కారణం అదేనట. ప్రపంచప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో రాజమౌళి కొలాబరేట్ అయినట్టు కూడా వార్తలొచ్చాయి.
‘అవతార్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా డిసెంబర్లో ఇండియా రానున్న హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయించాలనే ప్లాన్‌లో ఆంతర్యం కూడా అదే అని వినికిడి. మరి ఆ కోణంలో ఆలోచిస్తే.. ‘వారణాసి’ టైటిల్ సరికాదని, అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాగా కథకు కలిసొచ్చేలా టైటిల్ పెడితే కరెక్ట్ అని కొందరు అంటున్నారు. నవంబర్ 16న హైదరాబాద్‌లో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ ఈవెంట్లోనే ఫస్ట్‌లుక్‌తోపాటు టైటిల్ కూడా రివీల్ చేస్తారట.