ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడిన సినిమాలేవీ శ్రీలీలకు లేవు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి కానీ తగ్గడంలేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమె నిదానంగా బిజీ అయిపోతున్నది. ఆమె నటించిన తమిళ పానిండియా సినిమా ‘పరాశక్తి’ ఈ సంక్రాంతికి విడుదల కానున్నది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర రూపొందించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శ్రీలీలది కీలక పాత్ర అట. ఈ పాత్ర గురించి రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది శ్రీలీల.
‘నిలదొక్కుకోవడానికి కొన్ని సినిమాలు చేస్తాం. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడానికి కొన్ని సినిమాలు చేస్తాం. ఇన్నాళ్లూ నిలదొక్కుకోవడానికే సినిమాలు చేశాను. తొలిసారి నిలిచిపోయే సినిమా చేస్తున్నాను. అదే ‘పరాశక్తి’. నా సినిమాలన్నీ ఒకెత్తు. రానున్న ‘పరాశక్తి’ ఒకెత్తు. 60ల్లో జరిగే కథ ఇది. అప్పటి మధ్య తరగతి అమ్మాయి పాత్ర నాది. నా పాత్రను సుధా కొంగర అద్భుతంగా డిజైన్ చేశారు. పాతకాలం హీరోయిన్లను చూసిన ఫీల్ నా పాత్రను చూస్తే కలుగుతుంది. ఆహార్యం, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. సంఘర్షణలతో కూడుకున్న పాత్ర నాది. నటిగా నన్ను మరోమెట్టు పైన నిలబెట్టే సినిమా ఇది’ అంటూ ఆనందం వెలిబుచ్చింది శ్రీలీల.