‘సినిమాలంటే ఇష్టం. చిన్నప్పట్నుంచీ దర్శకుడ్ని కావాలనేది నా కల. అందుకే ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. వాటికి అవార్డులు కూడా వచ్చాయి. ఆ కాన్ఫిడెంట్తోనే ఇప్పుడు ‘రహస్యం ఇదం జగత్’ సినిమా చేశాను. నిజానికి ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మనదేశానికి చెందిన శ్రీచక్రం గురించి ఆమెరికాలో అన్వేషణ జరిగింది. అమెరికాలో ఆ అన్వేషణ జరిగిన ప్రదేశానికి నేనుండే ప్లేస్ చాలా దగ్గర. ఆ శ్రీచక్ర అన్వేషణ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అందుకే ఆ నేపథ్యంలో కథ రాసుకున్నాను.’ అని చెప్పారు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్’.
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్ విలేకరులతో ముచ్చటించారు. ఈ కథలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే అంశాలు ఉన్నాయని, పురాణాలు, పూర్వీకుల గురించి ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయని, కథకు తగ్గట్టుగా కేరక్టర్లు, ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు చెప్పారు.