Mangalavaaram Review | ఏండేండ్ల కిందట ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడమే కాకుండా తొలి సినిమాతోనే నటుడు కార్తికేయని స్టార్ హీరోని చేసింది. అయితే ఆ సినిమా అనంతరం అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం ఫ్లాప్ అవ్వగా.. చాలా గ్యాప్ తీసుకుని మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా పెట్టి సినిమా తీశాడు. ప్రియదర్శి ఇందులో కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అజయ్ భూపతి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి పార్ట్‌లాగే ఇందులో కూడా కథానాయిక గ్రామీణ యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మంగళవారం ఫస్ట్ పార్ట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఊర్లో ప్రతి మంగళవారం అక్రమసంబంధం కలిగివున్న జంట భయంకరంగా హత్యకు గురవుతుంటారు. వారి బండారాన్ని ఓ అగంతకుడు ఊళ్లో ఏదో ఒక గోడమీద రాసి ఆ జంటను చంపుతుంటాడు. ఆ మిస్టరీని ఛేదించటానికి లేడీ ఎస్ఐ రంగంలోకి దిగుతుంది. కానీ ఆ ఊరు సహకరించదు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోటానికి ఊరుఊరూ నడుంబిగించి రాత్రుళ్లు వెతకడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ ఊరుకి సంబంధించిన ఓ కుర్రాడు గోడమీద రాస్తూ ఊరిజనానికి దొరికిపోతాడు. వాడ్ని తన్నీ స్టేషన్‌కి అప్పజెబుతారు. అయితే, మరణించిన శవాల పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం చంపింది ఆ దొరికిన కుర్రాడు కాదు. దాంతో అతడ్ని పోలీసులు వదిలేస్తారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఏంటి? ఎవరు చంపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.