సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా యువతలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది శ్రీలీల. ఈ అచ్చ తెలుగందానికి సరైన హిట్ పడితే చూడాలన్నది అభిమానుల కోరిక. ఇటీవల విడుదలైన ‘రాబిన్‌హుడ్’ సినిమా సైతం శ్రీలీలకు నిరాశే మిగిల్చింది. అయినా అవకాశాల్ని అందిపుచ్చుకునే విషయంలో తగ్గేదేలే అంటున్నదీ అమ్మడు. ప్రస్తుతం ఈ సొగసరి నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో ఈ భామ రామ్‌చరణ్ సరసన ప్రత్యేకగీతంలో నర్తించనున్నదని తెలిసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి.
అయితే ఆమె నుంచి ఇంకా అంగీకారం రావాల్సి ఉందని చెబుతున్నారు. ‘పుష్ప-2’ చిత్రంలో ‘కిస్సిక్..’ అంటూ శ్రీలీల చేసిన స్పెషల్‌సాంగ్ చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా మాస్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ చిత్రంలో ఐటెంసాంగ్ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాస్ జాతర, లెనిన్, హిందీలో ఆషికీ-3, తమిళంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.