Hanuman Ansh | ఉత్తరాదిలో ఫేమస్ అయిన నీమ్ కరోలి బాబా (Neem Karoli Baba) జీవితాధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయంతో అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా, అతి తక్కువ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మౌత్ టాక్ బలతో అనూహ్యమైన వసూళ్లను సాధిస్తోంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు కేవలం పది లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ కారణంగా పలు ప్రాంతాలలో దీని షోలను 250 నుంచి కేవలం 25కి కుదించారు. మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వాహకులు సైతం ఈ సినిమా ప్రదర్శన పట్ల నిరుత్సాహం కనబరిచారు. అయితే, చిత్రంలోని ఆధ్యాత్మిక లోతు, భావోద్వేగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ పుంజుకుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో దూసుకుపోతూ ఇప్పటివరకు రూ. 72.88 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈ అఖండ విజయంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోగా, దర్శకుడు విశాల్ చతుర్వేది (Vishal Chathruvedi) బాలీవుడ్ ధోరణిపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఈ సినిమా కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరూ అండగా నిలవలేదని, సహాయం కోరితే ముఖం చాటేశారని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలబడవంటూ కొందరు ఉచిత సలహాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కానీ చిత్రం విజయం సాధించిన తర్వాతే ప్రముఖుల నుంచి ఫోన్లు, అభినందనలు వస్తున్నాయని తెలిపారు. సినిమా తొలి రోజుల్లోనే స్పందించి అభినందించిన దర్శకుడు మధుర్ భండార్కర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎంపీ మరియు నటి కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని వీక్షించి, ఇందులోని ఆధ్యాత్మిక భావనలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయని ప్రశంసించినట్లు ఆయన వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.