Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం స్పిరిట్ పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా ప్రకటించిన నాటి నుంచి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షూటింగ్ పురోగతిపై కీలక సమాచారం వెల్లడించారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TATA) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ అప్డేట్ను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పాల్గొన్నారు. వేదికపై మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ చిత్రీకరణ ఇప్పటికే 40 శాతం పూర్తయిందని వెల్లడించారు.
అంతేకాదు, ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా రూపొందిస్తున్నామని, ప్రభాస్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సందీప్ చేసిన ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండటంతో విడుదలపై కూడా త్వరలో మరిన్ని అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘స్పిరిట్’ అనౌన్స్మెంట్ సమయంలో విడుదలైన వాయిస్ టీజర్‌తోనే సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్‌ను “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్” అంటూ సందీప్ రెడ్డి వంగా పరిచయం చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. అకాడమీ టాపర్‌గా ఎదిగిన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలు, అతనిపై వచ్చిన ఆరోపణలు, వాటి వెనుక ఉన్న అసలు నిజం కథలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన కూడా చోటుచేసుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రంలోని బాబీ డియోల్‌పై చిత్రీకరించిన ‘జమాల్ కుడు’ పాటకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టెప్పులు వేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.