Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వాయిదా వార్తలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, విడుదల తేదీ మారే అవకాశముందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మేకర్స్ తాజాగా అధికారికంగా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రాజెక్ట్ అనుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అనవసర ప్రచారాలను నమ్మొద్దని అభిమానులను కోరింది. సినిమా గురించి ఏదైనా కీలక సమాచారం ఉంటే స్వయంగా తామే ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ప్రభాస్ రేంజ్, సందీప్ రెడ్డి వంగా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ యాక్షన్, ఎమోషన్స్, స్టైలిష్ టేకింగ్‌తో సినిమాను రూపొందిస్తున్నారట. ఈ క్లారిటీ రావడంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “స్పిరిట్ వాయిదా లేదు” అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ కథను తెరకెక్కిస్తున్నారట. హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ నటిస్తుండగా.. వీరిద్దరి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. గతంలో యానిమల్ సినిమాలో చూపించిన బోల్డ్ రొమాన్స్ కారణంగా.. ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్-త్రిప్తి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక స్క్రిప్ట్ రీరైట్ కారణంగానే సినిమా ఆలస్యమవుతోందని వచ్చిన వార్తలపై కూడా ఇండస్ట్రీ వర్గాలు స్పందిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రీ-ప్రొడక్షన్ దశలో మార్పులు, చేర్పులు సహజమని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలను మరింత బలంగా చూపించేందుకు దర్శకులు అప్పటికప్పుడు మార్పులు చేయడం సాధారణమేనని, దాన్ని వాయిదా ప్రచారంగా మార్చడం సరైంది కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి పలువురు దర్శకులతో భారీ ప్రాజెక్ట్‌ల్లో బిజీగా ఉన్నారు. ‘స్పిరిట్’తో పాటు ఫౌజీ, కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అయితే వీటిలో ఎక్కువ సమయాన్ని మాత్రం ‘స్పిరిట్’కే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సినిమాలకు సంబంధించి ప్రస్తుతం లైట్ వెయిట్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా.. ‘స్పిరిట్’పై మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.