Spirit Is Not One | ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ టైటిల్ వివాదంతో తాము సర్వం కోల్పోయామని, ప్రభాస్ గారే తమకు దిక్కని మహిళా రైతు నిర్మాత నర్సమ్మ వేడుకున్నారు. 8th వండర్ సినిమాస్ బ్యానర్‌పై తాము నిర్మించిన ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ చిత్రానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా నిర్మాతలు టీ-సిరీస్ తరఫున రెండు లీగల్ నోటీసులు పంపి విడుదలను ఆపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ మొదలు కాకముందే తమ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని, యూట్యూబ్ ఛానెళ్లు, వార్తాపత్రికల్లో ప్రచారం చేశామని నర్సమ్మ తెలిపారు. గత నెలలో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసి పోస్టర్లు కూడా ప్రింట్ చేశామని, అయితే సందీప్ రెడ్డి వంగా మేనేజర్ ద్వారా తమ ఇంటి చిరునామా సేకరించి టీ-సిరీస్‌కు ఇచ్చి నోటీసులు పంపించారని చెప్పారు. దీంతో రిలీజ్ ఆగిపోయిందని, డబ్బు ఇస్తామన్న వాళ్లు కూడా వెనక్కి తగ్గారని, ఊళ్లో పరువు పోయిందని ఆమె వాపోయారు. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మా చిన్న సినిమాపై కేసు వేసి రోడ్డున పడేశారు. మాతో మాట్లాడితే టైటిల్ మార్చుకునే వాళ్లం. మమ్మల్ని సంప్రదించకుండానే నోటీసులు పంపారు’ అని నర్సమ్మ అన్నారు. సినిమా కోసం అప్పులు చేశామని, రుణదాతల ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, లాయర్ నోటీసులు ఊళ్లో ఇంటికి పంపడంతో అప్పులు ఎగ్గొట్టాలని చూస్తున్నామనే నింద పడిందని తెలిపారు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాపై అభిమానంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నానని, పెద్దల సమక్షంలో చర్చించి సమస్య పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమని చెప్పారు. టైటిల్ మార్చుకోవడానికైనా సిద్ధమని, తమ చిన్న సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాను వాయిదా వేయాలని చేతులు జోడించి కోరారు. తమ సినిమా విడుదల, ప్రదర్శన, డిజిటల్ హక్కులకు అభ్యంతరం లేదని టీ-సిరీస్ నుంచి అధికారిక లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఇది నా చిన్ననాటి కల. మా కుటుంబ కష్టం, ఆశలు ఈ సినిమాలో ఉన్నాయి. న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించడం తప్ప మాకు మరో మార్గం లేదు. ఆర్థిక నష్టం, పరువు నష్టానికి న్యాయపరంగా పోరాడతాం’ అని నర్సమ్మ పేర్కొన్నారు. అయినా పరస్పర అవగాహనతో సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని ఆమె తెలిపారు.