Spirit | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన ‘స్పిరిట్ – వన్ బ్యాడ్ హ్యాబిట్’ ప్రోమోతోనే భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా 2026 న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
“ఇండియన్ సినిమా… మీ అజానుబాహుడిని చూడు” అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేయగా, ఇది పూర్తిగా వంగా మార్క్ ఇంటెన్సిటీతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఈ పోస్టర్లో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, నల్ల కళ్లద్దాలతో రెబల్‌గా కనిపిస్తూ, నోట్లో సిగరెట్ పెట్టుకొని ఒక చేతిలో మందు గ్లాస్ పట్టుకున్న ప్రభాస్ స్టైల్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఎదురుగా త్రిప్తి దిమ్రి లైటర్ వెలిగిస్తూ కనిపించడం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ టోన్‌ను తీసుకొచ్చింది.
ఇంకో వైపు షర్ట్ లేకుండా వైట్ ప్యాంట్లో ప్రభాస్ బ్యాక్ సైడ్ లుక్ మాత్రమే చూపిస్తూ, ఆయన శరీరంపై కనిపించే గాయాలు, వాటికి కట్టిన కట్లు ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర ఎంత వైల్డ్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉండబోతుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ లుక్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పాత్రను మించి ప్రభాస్ క్యారెక్టర్ ఉండబోతుందని, ఇదే లుక్‌తో బాక్సాఫీస్‌ను తగలబెట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ‘స్పిరిట్’ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్, ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోతోందన్న అంచనాలు ఇప్పటికే బలంగా ఉన్నాయి.