‘ఇప్పటిదాకా సీరియస్ సబ్జెక్ట్స్‌లో నటించాను. ఇకపై కాసేపు నవ్వించే సరదా సినిమాల్లో కనిపిస్తా’ అంటున్నది దక్షిణాది తార ఐశ్వర్య రాజేష్. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీశ్’ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుందీ నాయిక. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె కోలీవుడ్‌లో ప్రస్తుతం ‘సొప్పన సుందరి’ అనే చిత్రంలో నటిస్తున్నది. కారు ప్రధాన పాత్రలో కనిపించే ఈ సినిమా వినోదాత్మకంగా సాగనుంది.
ఎస్జీ చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ…‘గత కొంతకాలంగా సీరియస్ కథలతో ఉన్న సినిమాల్లో నటించాను. ఈ తరహా చిత్రాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నా. సరదాగా ఉండి కాసేపు నవ్వించే సినిమాల్లో నటించాలని ఉంది. ఇలాంటి సమయంలో దర్శకుడు ఎస్జీ చార్లెస్ మంచి కామెడీ స్క్రిప్ట్ వినిపించారు.
అహల్య అనే ఓ మధ్య తరగతి అమ్మాయికి లక్కీ డ్రాలో పది లక్షల రూపాయల విలువైన కారు దక్కితే ఆమె జీవితం ఎలా మారిపోతుంది అనేది ఈ సినిమాలో హ్యూమరస్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే నవ్వించడం అంత సులువు కాదని ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తెలిసింది’ అని చెప్పింది.