‘బిగ్‌బాస్’ ఫేమ్ వీజే సన్నీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హిత్రిక శ్రీనివాస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్ గజేంద్ర నిర్మాతలు. వచ్చే నెలలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సంపత్ నంది విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్ బావుంది. అలాగే మెహిత్ చేసిన సంగీతం కూడా చాలా బావుంది. ఈ చిత్రం మరో ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది’ అన్నారు. నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ ‘మా సంస్థ నుంచి వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ న్యూఏజ్ స్టోరీస్‌తో సినిమాలు చేయాలన్న సంకల్పంతో మా సంస్థ చిత్రాలను నిర్మిస్తుంది’ అన్నారు.