Sonu Sood | రీల్ లైఫ్లో విలన్ అయిన సోనూ సూద్ రియల్ లైఫ్లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఆయన తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేసేందుకు ఎంతగానో కృషి చేశాడు. కోవిడ్ సమయంలో సహాయం అవసరమైన వారికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు. విజయవాడ వరదల సమయంలోనూ తన ఛారిటి ఫౌండేషన్ తరుఫున ఎంతో మందికి సాయం అందించారు సోనూసూద్. ఇక రీసెంట్గా సోనూ సూద్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జూన్ 2వ తేదీన వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సోనూ సూద్ .. తాను మొదటిసారిగా 25 ఏండ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారి ప్రార్థించానని అన్నారు. అలానే నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నామని, అందులో తాను నటిండటంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక సోనూసూద్ తిరుమల తిరుగు ప్రయాణంలో ఓ చిరు వ్యాపారిని కలిసి ఆప్యాయంగా పలకరించారు.
తిరుమలలో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో ముచ్చటించిన సోనూసూద్ ఆమెని ఆప్యాయంగా పలకరించాడు. కుటుంబ విషయాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత 25 సంవత్సరాలుగా భేల్ పూరి విక్రయిస్తున్నానని చెప్పుకొచ్చింది జ్యోతి. అయితే బేల్ పూరి ధర అడిగి తెలుసుకున్న సోనూసూద్ ఆ తర్వాత ఆమె దగ్గర కొనుగోలు చేసి రుచి చూశాడు. చాలా బాగుందని అన్నాడు. చిరు వ్యాపారుల దగ్గర మనం కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని సోనూసూద్ చెప్పడంతో జ్యోతి చాలా సంతోషించింది. ఓ సాధారణ వ్యక్తిలా బేల్ పూరి కొనుగోలు చేసి జ్యోతితో కాసేపు ముచ్చటించిన సోనూ సూద్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.