Sonu Sood | ఢిల్లీలోని సత్య నికేతన్‌లో జరిగిన ఐదు అంతస్తుల పీజీ భవనం కూలిన ఘటనపై ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సొంతూళ్లను వదిలి ఇతర నగరాలకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సురక్షితమైన, సరసమైన ధరల్లో వసతి గృహాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో విద్యార్థుల సంఖ్యకు, అందుబాటులో ఉన్న హాస్టల్ సౌకర్యాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీల్లో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, కేవలం 30 వేల మందికి మాత్రమే హాస్టల్ వసతి లభిస్తోందని, అంటే ప్రతి 31 మంది విద్యార్థులలో కేవలం ఒక్కరికి మాత్రమే హాస్టల్ దక్కుతోందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) నివేదిక ప్రకారం.. ఈ భవనానికి ఎలాంటి అనుమతి లేదని, అక్రమంగా బేస్‌మెంట్‌తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఐదో అంతస్తును కూడా నిర్మించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను కాపాడటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సోనూసూద్ కోరారు. విశ్వవిద్యాలయాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి సురక్షితమైన హాస్టళ్లను నిర్మించాలని, అలాగే క్యాంపస్‌లలో వసతిని పెంచుకోవడానికి వర్సిటీలకు అదనపు అనుమతులు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ చిన్న విధానపరమైన మార్పుతో విద్యార్థులకు భద్రత, తల్లిదండ్రులకు మనశ్శాంతి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని, వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు.