Sonu Nigam apologises | బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “కన్నడ, కన్నడ, కన్నడ అంటూ ఇలాంటి భావజాలంతోనే కదా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది” అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంగీత కార్యక్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) పేర్కొంది.
మరోవైపు దీనిపై కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి (KFCC) స్పందిస్తూ.. సోనూ నిగమ్‌ను కన్నడ సినిమాల్లో పాటలు పాడకుండా నిషేధించింది. అతను బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని KFCC అధ్యక్షుడు ఎం. నరసింహులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోనూ నిగమ్ తాజాగా క్షమాపణలు చెప్పారు. “క్షమించండి కర్ణాటక. మీపై నాకున్న ప్రేమ నా అహంకారం కంటే చాలా పెద్దది. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను” అని ఆయన సోషల్ మీడియాలో రాసుకోచ్చాడు.
అంతకుముందు, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ సోనూ నిగమ్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. తనను కొందరు దుర్భాషలాడారని, బెదిరించారని ఆయన ఆరోపించారు. భాష పేరుతో ద్వేషం వ్యాప్తి చేసే వారిని ఎదుర్కోవాలని ఆయన అన్నారు. అయితే దీనిపై కూడా వ్యతిరేకత రావడంతో తాజాగా క్షమాపణలు తెలిపాడు. మరోవైపు కర్ణాటక పోలీసులు సోనూ నిగమ్‌కు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.