విఫల ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమని… వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకుసాగాలని సలహానిచ్చింది బాలీవుడ్ కథానాయిక సోనాక్షిసిన్హా. ఇరవై ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డానని, ఐదేళ్లు సాఫీగా సాగిన తమ ప్రణయబంధం అనూహ్యంగా ముగిసిపోయిందని ఆమె తెలిపింది. సోనాక్షిసిన్హా మాట్లాడుతూ ‘ఇద్దరం భవిష్యత్తు గురించి కలలుకన్నాం. కానీ విధి మరోలా తలచింది. అనుకోని మనస్పర్ధలతో మేమిద్దరం విడిపోయాం. అయితే కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుకుంది. బ్రేకప్ నుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితంలో ప్రేమ ఒక్కటే ముఖ్యం కాదని…కెరీర్లో విజయం సాధించడం అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిస్తుందని అర్థమైంది. ఎవరి కోసమో మన ఇష్టాల్ని, అభిరుచుల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని అవగతమైంది. ప్రేమలో నా వ్యక్తిత్వాన్ని త్యాగం చేయలేక అతని నుంచి విడిపోయా’ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి పేరును వెల్లడించడానికి మాత్రం సోనాక్షిసిన్హా ఇష్టపడలేదు.