రెండు ఆస్కార్ అవార్డులు గెల్చుకుని భారతీయ సినీ ఘనత చాటారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. 2009లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సాంగ్ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు రెహమాన్. అయితే ఆ వేదిక నుంచి రెహమాన్ చేసిన ప్రసంగాన్ని కొందరు విమర్శించారు. ప్రస్తుతం 95వ ఆస్కార్ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నారు రెహమాన్. ఆయన మాట్లాడుతూ…
‘ప్రపంచంలో ఏ కళాకారుడైనా ప్రేమను పంచాలనుకుంటారు. ఆ సహృదయతే అతన్ని ఆర్టిస్ట్‌ను చేస్తుంది. నా జీవితంలోనూ ప్రేమ, ద్వేషం రెండూ ఎదురయ్యాయి. కానీ నేను ప్రేమనే ఎంచుకున్నాను. ఇదే విషయాన్ని అప్పుడు ఆస్కార్ వేదిక మీద చెప్పాను. కానీ కొందరు నా మాటల్ని అపార్థం చేసుకున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డ్లు గెల్చుకున్న క్షణాన్ని నమ్మలేకపోయాను’ అని చెప్పారు.