Sobhita Dhulipala | అక్కినేని యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. నేటికి వీరి పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శోభిత ధూళిపాళ తమ పెళ్లి రోజు నాటి అరుదైన వీడియో క్లిప్‌లను అభిమానులతో పంచుకుంది. శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో.. నాగచైతన్య, శోభితల సాంప్రదాయ తెలుగు వివాహ వేడుకలోని మధుర క్షణాలు కనువిందు చేస్తున్నాయి. అప్పటివరకు ఎప్పుడూ చూడని ఈ క్లిప్‌లలో.. ఇద్దరి మధ్య ఉన్న అనురాగం, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ క్యూట్ వీడియోకు శోభిత ఒక ఎమోషనల్ క్యాప్షన్‌ను కూడా జతచేసింది. “గాలి ఎప్పుడూ ఇంటి వైపుకే వీస్తుంది. నేను దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చి, నా భర్తగా ఉన్న వ్యక్తితో కలిసి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రయాణాన్ని (సంవత్సరాన్ని) ముగించాను. అగ్నితో శుద్ధి అయినట్లుగా నాకు కొత్త అనుభూతి కలుగుతోంది. శ్రీమతిగా ఒక సంవత్సరం…” అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.