Skanda Movie | బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా 18 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ ఇది. ఊర మాస్ సినిమాగా వచ్చిన దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. సినిమాలో నరుకుడు ఎక్కువైపోయింది.. తల తోక లేని సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.. లాజిక్ అసలు పట్టించుకోలేదు అంటూ బోయపాటిపై ఎప్పటిలాగే కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ మాస్ ఆడియన్స్కు నచ్చే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. వాటి పైన ఎక్కువగా ఫోకస్ చేశాడు ఈ దర్శకుడు. దాంతో కచ్చితంగా బీ,సీ సెంటర్స్ లో సినిమా కుమ్మేస్తుంది అని నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.
రెండో రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. నిజం చెప్పాలంటే ఇది మంచి హోల్డ్ అనుకోవాలి. సెకండ్ డే మూడున్నర కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. వీకెండ్ వచ్చేసరికి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంది. వైలెన్స్ ఎక్కువ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే మాస్ ఆడియన్స్ మాత్రం స్కంద సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఇందులో పొలిటికల్ డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ పై కొన్ని డైరెక్ట్ సెటైర్లు వేసాడు బోయపాటి శీను. దాంతో రాజకీయంగాను స్కంద గురించి చర్చ బాగానే జరుగుతుంది. అయితే ఇది కలెక్షన్లు పెరగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నా కూడా సినిమాలకు పెద్దగా హెల్ప్ అవడం లేదు. మొన్న బ్రో సినిమా విషయంలోను ఇదే జరిగింది. కేవలం ఓపెనింగ్స్ వరకు వచ్చాయి కానీ.. ఆ తర్వాత నాలుగో రోజు నుంచి సినిమా దారుణంగా పడిపోయింది. ఇప్పుడు స్కంద ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పైగా సినిమాకు టాక్ కూడా సోసో గానే ఉండడంతో వీకెండ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ ను బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది.