ధనుష్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. నాగవంశీ-సాయిసౌజన్య నిర్మాతలు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బంజారా’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ పాటకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్నందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పల్లె వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ జీవితం తాలూకు వేదాంతాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ ‘జీవిత వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు పరమార్థాన్ని ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం.
భగవంతుడు నీ కోసం ఓ స్థానం పెట్టాడు. అక్కడకు చేరుకోవడం నీ బాధ్యత అని తెలియజేసే పాట ఇది. ఆదిశంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టిలో పెట్టుకొని సాహిత్యాన్నందించాను’ అని సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు చెప్పారు. సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాతలు: నాగవంశీ ఎస్, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.