Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నప్పటికీ, మరోవైపు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను అతిగా గ్లామరైజ్ చేయడం, ఆమెను కేవలం ఒక వస్తువులా చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ గాయని సుమంగలి అరియనాయగం ఘాటుగా స్పందించింది. చిత్ర మేకర్స్ ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. బలహీనుల ఆవేదన, అణచివేత చుట్టూ కథను అల్లుకున్న చిత్ర బృందం, అదే గౌరవాన్ని జాన్వీ కపూర్ పాత్రకు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆమె మండిపడింది.
‘అధికారం లేని సగటు మనుషుల ఆవేదన, అణచివేత చుట్టూ కథను అల్లుకోవడానికి ఒక గది నిండా శక్తివంతమైన పురుషులు కూర్చున్నారు. కానీ దురదృష్టవశాత్తూ, అదే సమయంలో వారు జాన్వీ కపూర్ పాత్రను కేవలం కెమెరా ముందు ప్రదర్శించే ఒక శరీరంగా, బలవంతపు ముద్దు సీన్ కోసం వాడుకునే ఒక ప్రాప్గా మార్చేశారు. కేవలం పాటలు ముగిసేవరకు మాత్రమే పరిమితమయ్యేలా ఆమె పాత్రను వాడుకొని వదిలేశారు. వారికి మానవ గౌరవం అంటే ఏమిటో బాగా తెలుసు, కానీ ఆ గౌరవానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని వారు నిర్ణయించుకున్నారు’ అంటూ సుమంగలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.