కొద్దిరోజులనుంచి వివాదాస్పదంగా మారిన అన్నమయ్య కీర్తన వీడియోపై సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. అన్నమయ్య కీర్తనపై తీసిన తన వ్యక్తిగత వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించింది. ఈ వీడియోపై అన్నమయ్య వంశీకులతోపాటు పలువురు స్వామివారి భక్తులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అన్నమయ్య కీర్తన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’పై శ్రావణ భార్గవి మ్యూజికల్ వీడియోను రూపొందించింది. ఇందులో తనే నటించింది. ఈ మ్యూజికల్ వీడియోను తన యూట్యూబ్ చానల్లో విడుదల చేసింది. ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో విశేష స్పందన లభించింది. అయితే, అన్నమయ్య కీర్తనలను శ్రావణ భార్గవి శృంగార కీర్తనలుగా మార్చేసిందని, వెంటనే ఆ వీడియోను తొలగించాలని అన్నమయ్య ట్రస్టు సభ్యులు, అన్నమయ్య వంశీకులు డిమాండ్ చేశారు. మరికొందరు శ్రావణ భార్గవి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దీనిపై శ్రావణ భార్గవి గట్టిగానే స్పందించారు. మహిళా గాయకులు ఆడియో, వీడియో ఆల్బమ్స్పైనే వివాదాలు సృష్టిస్తారని వాపోయారు. వీడియోను డిలీట్ చేసే ప్రసక్తే లేదన్నారు.
కాగా, శ్రావణ భార్గవిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుపతికి చెందిన కొందరు శనివారం ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన శ్రావణ భార్గవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య వారసులకు క్షమాపణలు చెప్పడంతోపాటు శ్రావణ భార్గవి వెంటనే ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమెను తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని, శ్రీవారి దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోపై శ్రావణ భార్గవి దిగివచ్చారు. తన యూట్యూబ్ చానల్నుంచి వీడియోను తొలగించారు. ఇన్స్టాలో అన్నమయ్య కీర్తన తీసేసి, వేరే పాటతో వీడియోను అలానే ఉంచుతానని స్పష్టంచేశారు.