Singer Chinmayi | తమిళనాడు చెన్నైలో ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకుపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, చిన్నారి మరో అంతస్తు వరకు వచ్చి ఆగిపోయింది. ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారి తల్లిది తప్పని కామెంట్ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. తెలిసిన వారు, ఇరుగుపొరు వారి సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన చిన్నారి తల్లి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి ఇన్స్టా వేదికగా స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ట్రోలింగ్ కారణంగా ఓ చిన్నారి తల్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుందని.. ఇప్పుడు మీకు సంతోషం కదా? అంటూ తీవ్రంగా స్పందించింది. అత్యాచారం చేసే వాళ్లపై ఇంత ఎందుకు స్పందించరంటూ నిలదీసింది. టికెట్లు కొనుగోలు చేసి మరీ హత్య, అత్యాచారం చేసే వారి పర్ఫామెన్స్ చూస్తారు.. ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో వారంతా వచ్చి ఆ చిన్నారిని చూసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.